NEW DELHI MEDIA HOUSE
Breaking News

జీశాట్‌-18 టెలికమ్యూనికేషన్‌ సేవలు బలోపేతం ,.

Updated: Monday 10,2016

దేశంలో టెలికమ్యూనికేషన్‌ సేవలకు వూతమిచ్చే అధునాతన జీశాట్‌-18 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియాన్‌-5 వీఏ-231 రాకెట్‌ ద్వారా భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక దాదాపు 2.00గంటల సమయంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. దక్షిణ అమెరికాలోని ఈశాన్య తీరంలో ఉన్న ఫ్రెంచ్‌ గయానా.. ఫ్రాన్స్‌ నియంత్రణలో ఉంది. 3404 కిలోల బరువున్న జీశాట్‌-18తోపాటు ఆస్ట్రేలియా సంస్థ నేషనల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ (ఎన్‌బీఎన్‌)కు చెందిన ‘స్కై మస్టర్‌-2’ ఉపగ్రహాన్ని ఏరియాన్‌ రాకెట్‌ మోసుకెళ్లింది. నిజానికి ఈ ప్రయోగం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరగాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా 24 గంటల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.

ప్రయోగించిన 32 నిమిషాల తర్వాత రాకెట్‌ నుంచి విడిపోయిన జీశాట్‌-18.. దీర్ఘవృత్తాకార భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లో చేరింది. ఈ కక్ష్యలో భూసమీప బిందువు (పెరిజీ) 251.7 కిలోమీటర్లు కాగా సుదూర బిందువు (అపోజీ) 35,888 కిలోమీటర్లుగా ఉంది. ఆ వెంటనే కర్ణాటకలోని హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ (ఎంసీఎఫ్‌).. ఈ ఉపగ్రహాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించి, అంతా సవ్యంగానే ఉన్నట్లు తేల్చింది. ప్రయోగం ఆసాంతం చక్కగా సాగిందని ఇస్రో ఛైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ తెలిపారు. జీశాట్‌-18 చాలా ముఖ్యమైన ఉపగ్రహమని ఆయన చెప్పారు. ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని ఆయన మిషన్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి వీక్షించారు.

జీశాట్‌-18కు రానున్న రోజుల్లో కక్ష్య పెంపు విన్యాసాలను ఇస్రో నిర్వహించనుంది. ఉపగ్రహంలోని సొంత చోదక వ్యవస్థ సాయంతో భూమధ్య రేఖకు ఎగువన 36వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి చేరుస్తుంది. 74 డిగ్రీల తూర్పు రేఖాంశంపైన దీన్ని ఉంచుతారు. కక్ష్యను పెంచాక ఉపగ్రహంలోని సౌర ఫలకాలను, యాంటెన్నా రిఫ్లెక్టర్లను విచ్చుకునేలా చేస్తారు. అనంతంర కొన్ని పరీక్షలు నిర్వహించి, వినియోగంలోకి తీసుకొస్తారు.


 
Tags:  G SAT 18 SATELLITE SUCCELFULLY LAUNCHED
 

Related Stories