NEW DELHI MEDIA HOUSE
Breaking News

కృష్ణా జల పంపిణీ పరిష్కరించండి .

Updated: Tuesday 28,2018

కృష్ణా జలాల వివాద పరిష్కార అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ముందుకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య జల పంపిణీ పరిష్కార వ్యవహారాన్ని మొదటి నుంచి విచారించేలా ట్రైబ్యునల్‌కు నిర్దేశించాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి కలిశారు. సుమారు 1.15 గంటల పాటు ప్రాజెక్టులు, రాష్ట్రంలోని జాతీయ రహదారులకు కేంద్రం నుంచి అందాల్సిన సహాయంపై చర్చించారు.

‘‘కృష్ణా జలాల వివాద పరిష్కార బాధ్యతను అంతర్రాష్ట్ర నదీ జల వివాద చట్టం 1956లోని సెక్షన్‌ 3 కింద ఉన్న నిబంధనల ప్రకారం ట్రైబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం 2014 ఏప్రిల్‌ 14న కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సెక్షన్‌ కింద కాకుండా బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ గడువునే పొడిగించి, విభజన చట్టంలోని సెక్షన్‌ 89 కింద ఈ అంశాన్ని ప్రతిపాదించింది. ఈ సెక్షన్‌ 89 కింద పొందుపరిచిన నిబంధనలకు చాలా పరిమితులున్నాయి. దానివల్ల తెలంగాణ లేవనెత్తిన అంశాలకు న్యాయం జరగదు. దీనిపై మేం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ఇప్పటికైనా తెలంగాణ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని ఈ అంశాన్ని కృష్ణా అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్‌ 5(1) కింద అయినా ట్రైబ్యునల్‌-2కి అప్పగించి మాకు న్యాయం చేయండి’’ అని కేసీఆర్‌ కేంద్ర మంత్రికి సమర్పించిన వినతిపత్రంలో కోరారు. తాము ప్రస్తావించిన అంశాలపై 8 లేఖలను కేంద్ర మంత్రికి అందజేశారు.


 
Tags:  ANDHRA TELANGANA KRISHNA WATER DIPUTE SALUTION KCR GADKARI.
 

Related Stories